Bhu Bharati Telangana Explained in Telugu | భూభారతి బిల్లుపై పూర్తి వివరాలు
భూ భారతి (Bhu Bharati) అంటే?
భూమి హక్కుల పరిరక్షణ, భూసంబంధిత లావాదేవీలను (land records) సులభంగా చేయడానికి తయారు చేయబడిన ఒక కొత్త భూభంధన వ్యవస్థ భూ భారతి. ఇది పాత ధరణి వ్యవస్థలో ఉన్న లోపాలను పరిష్కరించేందుకు తయారు చేయబడింది. ముఖ్యంగా, వ్యవసాయ భూముల రికార్డులను మరింత పారదర్శకంగా, అందరికీ ఉపయోగపడే విధంగా రూపొందించడమే దీని లక్ష్యం.
ధరణి (Dharani) ఉందిగా? భూ భారతి ఎందుకు??
ధరణి 2020లో ప్రారంభమైనప్పటికీ, పాత ధరణి వ్యవస్థ రైతులకు, భూసంబంధిత లావాదేవీలు చేసే వారికి చాలా సమస్యలను కలిగించింది. దీనిలో 33 మాడ్యూల్స్ ఉండటంతో (మాడ్యూల్స్ అంటే విభాగాలు) వ్యవస్థను ఉపయోగించడం కష్టంగా మారింది. చాలా మంది రైతులు తమ భూమి వివరాలు కూడా సరిగా పొందలేకపోయారు.
పరిస్థితి ఇలా ఉండటంతో, భూ భారతి కొత్తగా ప్రవేశపెట్టి సమస్యలను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ధరణి వ్యవస్థ లోపాలు (The issues with Dharani) –
- 33 మాడ్యూల్స్ వ్యవస్థను కష్టంగా చేయడం.
- రైతులకు వారి భూమి వివరాలను అర్థం చేసుకోవడం కష్టం కావడం.
- ఫిర్యాదుల ప్రాసెసింగ్ నెమ్మదిగా ఉండడం.
- అనేక భూముల వివరాలు “హిడెన్” (hidden) ఆప్షన్ వల్ల ఎవరికీ తెలియకుండా, చీకట్లో ఉండడం.
భూ భారతి – ధరణికి ఒక మెరుగైన ప్రత్యామ్నాయం
భూ భారతి (Bhu Bharati) ద్వారా ముఖ్యంగా పార్ట్ B లో ఉన్న 18 లక్షల ఎకరాల భూమికి సంబంధించి రెవెన్యూ అధికారుల ద్వారా డిజిటల్ సంతకం చేయబడింది.
పార్ట్ B (Part B) భూములు అనేవి యాజమాన్య హక్కులు పూర్తిగా నిర్ధారణ కాకుండా ఉన్న భూములు. భూ రికార్డుల స్పష్టత లేకపోవడం, అసంపూర్ణ నమోదు, లేదా పాత భూ వివాదాల వల్ల ఇవి Part Bలోకి వెళ్లాయి. దీని వల్ల పట్టాదారు పాసుబుక్‌లు ఇవ్వలేదు, రైతుబంధు సాయం రాలేదు. భూభారతి చట్టంతో ఈ భూములను గుర్తించి, రెగ్యులరైజ్ చేసి, పూర్తి హక్కులు ఇవ్వనున్నారు.
కొత్త భూ భారతి వ్యవస్థలో కేవలం 6 మాడ్యూల్స్ మాత్రమే ఉన్నాయి (ధరణిలో ఉన్న 33 మాడ్యూల్స్‌కు బదులుగా). SMS నోటిఫికేషన్లు, పహాణి రికార్డుల పునరుద్ధరణ, డ్రోన్ మ్యాపింగ్ ద్వారా భూసర్వే, భూదార్ సిస్టమ్ వంటి ఆధునిక ఫీచర్లను ప్రవేశపెట్టారు.
భూభారతి యొక్క ముఖ్య అంశాలు:
సులభమైన దరఖాస్తు విధానం (Easy application process):
అంతకుముందు ధరణి పోర్టల్‌లో 33 మాడ్యూళ్లు ఉండటం వల్ల, రైతులు తరచుగా తప్పులు చేసి అప్లికేషన్లు తిరస్కరించబడేవి. భూభారతి ఈ సమస్యను అధిగమించడానికి మాడ్యూళ్లను 6కి తగ్గించి, దరఖాస్తు ప్రక్రియను వేగవంతం చేసింది.
రియల్ టైమ్ SMS నోటిఫికేషన్లు (real-time SMS notifications):
భూమి యజమానులు తమ దరఖాస్తుల స్థితి గురించి SMS ద్వారా వెంటనే సమాచారం పొందుతారు. ఇది వ్యవస్థను పారదర్శకంగా ఉండేలా చేస్తుంది.
పారదర్శకత పెంపు (more transparency)
ధరణి పోర్టల్‌లో సున్నితమైన భూమి వివరాలను దాచే ‘హిడెన్’ ఆప్షన్ ఉండేది. భూభారతిలో ఆ ఎంపికను తొలగించి, అధికారికంగా అనుమతించిన వారు ఎక్కడి నుండైనా భూమి వివరాలను చూడగలిగేలా చేసింది.
పునరుద్ధరించిన పహాణి రికార్డులు (new Pahani records)
తెలంగాణలో 1950ల నుండి పహాణి రికార్డులకు చారిత్రక ప్రాధాన్యత ఉంది. గతంలో కుదించిన పహాణి రికార్డులను తిరిగి పూర్తి వివరాలతో తీసుకువచ్చారు. కొత్త పహాణిలో భూమి యజమాన్యం (ownership details), సర్వే నంబర్లు (survey numbers), ప్రభుత్వ భూమి లేదా ప్రైవేట్ భూమి (private or government owned land) వంటి 11 ముఖ్యమైన వివరాలు ఉండనున్నాయి.
భూభారతి చరిత్ర – గత అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలు
భూభారతి కొత్త చట్టం పూర్తిగా కొత్తది కాదు. 2004లో UPA ప్రభుత్వం దేశవ్యాప్తంగా భూభారతి పేరుతో ఒక ప్రాజెక్ట్ ప్రారంభించింది. మొదటగా నిజామాబాద్ జిల్లాలో దీనిని ప్రాయోగికంగా అమలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు దీనిని పునరుద్ధరించి, భూభారతి రికార్డు ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ యాక్ట్ 2024 పేరుతో తీసుకువచ్చింది (Telangana Bhu Bharati Record of Rights in Land Act 2024).
తెలంగాణ భూభారతి బిల్లు – ప్రధాన లక్ష్యాలు:
భూభారతి పాత భూమి సమస్యలను పరిష్కరించడానికి, కొత్త విధానాలను తీసుకురావడానికి ఉద్దేశించబడింది. దీనికి ధరణి పోర్టల్‌ను పూర్తిగా రద్దు చేసి, 19 కొత్త సెక్షన్లు కలిగిన నిర్దిష్టమైన చట్టాన్ని అమలు చేయనున్నారు.
బిల్లు యొక్క ముఖ్యమైన అంశాలు:
→ అపీల్స్ (Appeals) వ్యవస్థ: RDO (రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్), జిల్లా కలెక్టర్లతో పారదర్శకమైన వివాద పరిష్కార వ్యవస్థ.
→ ల్యాండ్ ట్రిబ్యునల్స్ (Land Tribunals): భూ వివాదాల కోసం ప్రత్యేక న్యాయ మండళ్లు ఏర్పరచి, పేదల కోసం ఉచిత న్యాయ సహాయం.
→ గ్రామ కంటం & అబాడీ (Abadi and Gram Kantam) భూములకు యాజమాన్య హక్కులు: ఇప్పటి వరకు అనధికారంగా ఉన్న భూములకు ప్రభుత్వం పూర్తి యాజమాన్య హక్కులు.
→ సదాబైనామా (Sadabainama) లావాదేవీల నియంత్రణ: 2014 ముందు జరిగిన భూ విక్రయాలన్నీ చట్టబద్ధం.
తెలంగాణ భూభారతి బిల్లు – కొత్త మార్పులు:
→ ప్రతి అంగుళం భూమికి చట్ట పరిరక్షణ (Legal Protection): ప్రతి భూమి యజమానునికి హక్కులు కట్టుబడి ఉండేలా ప్రభుత్వం చట్ట పరిరక్షణ.
→ రైతులకు ఉచిత న్యాయ సహాయం (Free legal advice for farmers): భూ వివాదాల్లో చిక్కుకున్న రైతులకు ఉచిత న్యాయ సేవలు.
→ ల్యాండ్ సర్వే & డిజిటల్ రికార్డులు: భూమిని దృశ్యమాపింగ్ (Geo Mapping) ద్వారా స్కాన్ చేసి, సరిహద్దులు ఖచ్చితంగా నిర్ణయించనున్నారు.
ముగింపు:
ఈ భూభారతి బిల్లుతో ప్రభుత్వ లక్ష్యం స్పష్టం — భూమి వ్యవస్థను పారదర్శకంగా, సమర్థంగా మార్చడం. రైతులు, భూమి యజమానులు, అధికారులకు సమస్యలేని వ్యవస్థను నిర్మించాలనే సంకల్పం ఉంది.
కానీ... ఇది కేవలం కాగితాల మీదేనా? నిజంగా భూసమస్యలు పోతాయా? లేక మళ్లీ అదే పాత తంటాలు కొనసాగుతాయా?
ఇది అమలు ఎలా జరుగుతుందో చూడాలి. ఇది జరగాలంటే కేవలం చట్టం సరిపోదు. ఆచరణలోకి రావాల్సిన పని ఉంది.
ఏదైతేనేం, ఇది తొలి అడుగు. మిగతాది — కాలమే చెప్పాలి.
భూ భారతి వల్ల లాభాలు:
ఎవరికి? (Entity) |
లాభం ఏమిటి? (Benefits) |
రైతులు (Farmers) |
భూమి హక్కులు కచ్చితంగా ఉంటాయి, భూమి కొనుగోలు, అమ్మకాలు సులభం, నమ్మకంగా లావాదేవీలు చేయొచ్చు. |
భూమి యజమానులు (Land Owners) |
తమ భూమి ఎవరో తీసుకోవడాన్ని (అక్రమ స్వాధీనం) అడ్డుకునే అవకాశం, భూమి వివరాలు స్పష్టంగా చూపించొచ్చు. |
ప్రభుత్వ అధికారులు (Government Officials) |
భూమి రికార్డులు సరిగ్గా ఉండటం వల్ల పనులు త్వరగా పూర్తవుతాయి, అధికారులు ఒకరితో ఒకరు సమన్వయం చేసుకోవడం సులువు. |
సాధారణ ప్రజలు (General Public) |
భూమి వివరాలు దాచడం వీలుకాదు, ఎవరి భూమి ఎవరిది అని స్పష్టంగా తెలుస్తుంది, భూమి లావాదేవీలు వేగంగా జరుగుతాయి. |